కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ రేషన్ డీలర్లు వాటర్‌ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు. తమ రేషన్ షాపులు తమకే కేటాయించాలని మాజీ రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన 58 రేషన్ షాపులను తమకే కేటాయించాలని, గతంలో రేషన్ డీలర్లుగా పని చేసిన దాదాపు 30 మంది డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంలోని సాయినగర్ వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ బాటిల్స్ చేత పట్టుకుని గురువారం నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్ వెంటనే ఇక్కడకు రావాలని కోరారు. పోలీసులు పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు హెచ్చరించారు. పాత రేషన్ డీలర్లు మాట్లాడుతూ.. అక్రమంగా నియమించిన రేషన్ డీలర్ల భర్తీని వెంటనే రద్దు చేసి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.