భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేసిన మరో భారీ ప్రయోగం విజయవంతం అయింది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు ఏరియన్-5 రాకెట్ ద్వారా జీశాట్-11 ఉపగ్రహాన్ని రోదసీలోకి విజయవంతంగా పంపింది. 5,854 కిలోల బరువున్న జీశాట్-11ను ఏరియన్-5 రాకెట్ 29 నిమిషాల ప్రయాణం అనంతరం కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లో పరిమాణం పరంగా జీశాట్-11 అత్యంత బరువైంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశమంతటా సెకనుకు 100 జీబీ డేటా అందించేందుకు నాలుగు జీశాట్-11 ఉపగ్రహా ప్రయోగాలకు ప్రణాళిక రూపొందించగా ఇది మూడోది. ఇది 15 ఏళ్లపాటు సేవలు అందించనుంది. దీనిలో దేశ సమాచార వ్యవస్థ కోసం 32 కేయు బాండ్‌తోపాటు 8 కేఏబాండ్ ట్రాన్స్‌ఫాండర్లను ఏర్పాటు చేశారు. నిమిషానికి 16 గిగాబైట్స్ వేగంతో ఇంటర్నెట్‌ను అందించనుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం సమాచారం అందించనున్న జీశాట్-11 ఉపగ్రహం భారత్‌కు విలువైన అంతరిక్ష అసెట్ గా నిలవనుందని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తెలిపారు.
దేశీయ తొలి హెచ్‌వైఎస్ఐఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఆరు రోజుల అనంతరం మరో భారీ ప్రయోగం నిర్వహించడం ఇస్రో చరిత్రలో మరో మైలురాయిని చేరుకున్నామన్నారు. జీశాట్ -11 విజయవంతం అవ్వడంతో భారత రాష్ట్ర పతి రామ్ నాధ్ కోవింద్, ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీతో సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.