ఘరానా మోసం.. అధిక లాభాలంటూ ప్రజలకు టోపీ..!

-

అధిక ప్రజలు కష్టపడకుండా సొమ్ము సంపాదించడానికే ఆసక్తి కనపరుస్తున్నారు. దాన్నే సదవకాశంగా భావించిన కొందరు వ్యక్తులు ప్రజలను మోసం చేస్తూ వారి వద్ద నగదును తీసుకుని పరారవుతున్నారు. ఇలాంటి సంఘటనే హైదరాబాద్ కేబీహెచ్పీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

 

తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ పంజాబ్‌వాసి చేసిన మోసం హైదరాబాద్ కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో ఓ బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఈసీఐఎల్‌కు చెందిన మార్లిన్‌ జెవియర్‌(34) పంజాబ్‌కు చెందిన ‘ట్రాన్స్‌ఫ్లెక్స్‌ పే టెక్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌’ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నగరంలో పలు ప్రాంతాల వాసులను డిస్ట్రిబ్యూటర్లు, సేల్స్‌మెన్లుగా నియమించుకున్నాడు. సేల్స్‌ మేనేజర్‌గా ఉన్న మార్లిన్‌ జెవియర్‌ చెప్పిన మాటలు నమ్మి పలువురు కంపెనీ అకౌంట్‌కు నగదు జమ చేశారు. ఈ క్రమంలోనే కేపీహెచ్‌బీ ఠాణా పరిధి హైదర్‌నగర్‌ వాసి గోపిశెట్టి వెంకట స్వరూప్‌ అనే వ్యక్తి జెవియర్ వద్ద డిస్ట్రిబ్యూటర్‌గా చేరాడు. స్వరూప్ 18 మంది రీటెయిలర్ల నుంచి తీసుకున్న నగదు రూ.20 లక్షల వరకు ఖాతా జమ చేశాడు. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్‌ బ్లాక్‌ అయినట్లు స్వరూప్‌ గుర్తించారు.

అదే విషయం మార్లిన్‌ జెవియర్‌ను ప్రశ్నించగా కేవైసీ సమస్య అంటూ దాటవేయసాగాడు. స్వరూప్‌ మరోమారు అడగటం వల్ల రూ.8 వేల చెక్కు ఇచ్చి మిగిలిన నగదు తర్వాత చెల్లిస్తామని చెప్పి ఫోన్‌లో అందుబాటులో లేకుండాపోయాడు. దీంతో ఆందోళన చెందిన స్వరూప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సెప్టెంబర్‌ 10న మార్లిన్‌ జెవియర్‌ను అరెస్టు చేశారు. తీగ లాగితే డొంక కదలిందన్న సామెతగా.. కంపెనీ సీఈవోగా చలామణీ అవుతున్న పంజాబ్‌ వాసి అశోక్‌ టాండన్‌(63) నగదు కాజేసినట్లు విచారణలో తేలింది. అతడి కోసం ఎస్ఐ నాగరాజు బృందం పంజాబ్‌ వెళ్లింది. కోర్టు అనుమతితో నిందితుడిని జలంధర్‌లో కస్టడికి తీసుకుని శుక్రవారం కేపీహెచ్‌బీ ఠాణాకు తరలించారు. శనివారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version