టీడీపీకి కంచుకోటలాంటి జిల్లాల్లో గుంటూరు జిల్లా ఒకటి. ఈ జిల్లాలో చంద్రబాబు రాజధాని ఏర్పాటు చేసినా కూడా గత ఎన్నికల్లో వైసీపీ రెండు మినహా అన్ని సీట్లలోనూ విజయం సాధించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీలో గ్రూపుల గోల ఎక్కువైంది. చాలా నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య పొసగడం లేదు. నాయకులు రచ్చకెక్కుతూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎంపీ లావు కృష్ణదేవరాయులు వర్సెస్ ఎమ్మెల్యే విడదల రజనీకి పడడం లేదు. అలాగే అదే నియోజకవర్గంలో సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు, ఎమ్మెల్యే రజనీకి కూడా ఏ మాత్రం పడడం లేదు.
ఇక తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి జిల్లాలో చాలా మంది శత్రువులు ఉన్నట్టే ఉంది. తాడికొండ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలుగా ఉన్న రజనీ, శ్రీదేవి పరస్పరం కలహించుకున్నారు. ఇక బాపట్ల ఎంపీ నందిగం సురేష్ స్వగ్రామం తాడికొండ పరిధిలో ఉండడంతో ఆయన కూడా ఎక్కువుగా ఈ నియోజకవర్గంలో వేలు పెడుతున్నారంటూ శ్రీదేవి అధిష్టానానికి పదే పదే కంప్లెంట్లు చేస్తోంది. ఈ నియోజకవర్గంలో శ్రీదేవి వర్సెస్ ఎంపీ సురేష్ మధ్య ఏ మాత్రం పడడం లేదు.
ఇక వినుకొండ నియోజకవర్గంలో ఎంపీ లావుకు, ఎమ్మెల్యే బొల్లాకు పడడం లేదు. ఎంపీ లావు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జున రావును ఎంకరేజ్ చేస్తున్నారని బొల్లా రగిలిపోతున్నారు. ఇక పొన్నూరులో ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణకు పడడం లేదు. రోశయ్యవర్గం రావిని అణగదొక్కుతుందని రావి వర్గం రగిలిపోతోంది. గుంటూరు వెస్ట్‌లో చంద్రగిరి ఏసురత్నంకు, పార్టీ మారిన ఎమ్మెల్యే మద్దాలి గిరి వర్గంకు పడడం లేదు.
ఇక గురజాల, నరసారావుపేటలోనూ గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. నరసారావుపేటలో స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి వర్గాలు వేర్వేరుగా రాజకీయాలు చేస్తున్నాయి. దాదాపు పదికి పైగా నియోజకవర్గాల్లో ఈ గ్రూపుల గోల ఎక్కువుగా ఉండడంతో పార్టీని పార్టీ నేతలే నాశనం చేసుకుంటున్నారు. జగన్ దీనిపై దృష్టి పెట్టకపోతే ఇది టీడీపీకి ఖచ్చితంగా ప్లస్ అయ్యేలా ఉంది.