మీరు రోడ్డు మీద వెళ్తున్నారు. వర్షం లేదు.. గిర్షం లేదు కానీ.. రోడ్డు మీద మురుగు నీరు ప్రవహిస్తుందనుకోండి.. ఏం చేస్తారు. నీళ్లు వదిలిన వాళ్లను ఓ రెండు మూడు తిట్లు తిట్టి వెళ్లిపోతారు. కానీ.. ఆ నీళ్ల వల్ల ఎంతో మంది సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే.. జీహెచ్ఎంసీ దీనిపై సీరియస్ గా స్పందించింది. ఇళ్లలోని నీటిని, మురుగునీళ్లను.. ఇలా ఏ నీళ్లయినా సరే.. రోడ్ల మీదికి వదిలే వాళ్లను భారీ జరిమానాలు విధించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమయింది. ఇప్పటికే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి జరిమానాలూ విధించింది. కనీస జరిమాన రెండు వేల నుంచి గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు కూడా జరిమానా విధించనున్నట్టు జీహెచ్ఎంసీ తెలిపింది.
నిజానికి ఇళ్లలో వాడుకున్న నీటిని రోడ్డు మీద వదలకుండా.. బయట ఉండే డ్రైనేజీకి కనెక్షన్ ఇచ్చుకొని.. దాంట్లో వదలాలి. కానీ.. చాలామంది ఇంటి యజమానులు… డ్రైనేజీ కనెక్షన్లు తీసుకోరు. తీసుకున్నా… నిర్లక్ష్యంగా రోడ్డు మీదికి వదిలేస్తారు. దీంతో వాహనదారులు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లే వాళ్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే… దీనిపై జీహెచ్ఎంసీ కొంచెం కఠినంగానే ప్రవర్తిస్తోంది. జరిమానాలు విధిస్తే.. వాళ్లు ఇంకోసారి నీటిని బయటికి వదలరు.