వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో యుగియనుంది. ఈ సందర్భంగా ఆయనకు సంఘీభావం తెలిపేందుకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. 340 రోజుల పాటు ఏపీలోని అన్ని జిల్లాల్లోని ప్రజలను నేరుగా కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. తెదేపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఇడుపులపాయలో 2017 నవంబరు 6న ప్రారంభమైన ఈ పాదయాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. మొత్తం 341 రోజుల్లో ఆయన సుమారు 3,648 కిలోమీటర్లు నడిచారు. ‘అన్న వస్తున్నాడు.. మంచి రోజులొస్తున్నాయి’ అంటూ మొత్తం 13 జిల్లాల మీదుగా జగన్ పాదయాత్ర కొనసాగించారు.
పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభను వైకాపా నిర్వహిస్తోంది. ఇచ్ఛాపురానికి ఒకటిన్నర కిలోమీటర్ల ముందు ఏర్పాటు చేసిన పాదయాత్ర విజయ స్తూపాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. ఇచ్ఛాపురంలో బుధవారం సభ ముగిసిన అనంతరం.. రాత్రికి విజయనగరం చేరుకుని అక్కడ్నుంచి రైల్లో తిరుపతికి వెళ్తారు. గురువారం ఉదయం అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి 11న ఉదయం తిరుమల నుంచి నేరుగా కడప చేరుకుని పెద్ద దర్గాను దర్శించి, పులివెందుల చేరుకుని చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. సర్వప్రార్థనల అనంతరం ఇడుపుల పాయలోని తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. ఆ తర్వాత పార్టీ అనుసరించాల్సిన కార్యక్రమాలపై వ్యూహరచన చేయనున్నారు.