కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిపోయిన ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు హస్తం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీలో చేతగానివాళ్లకే చోటు ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో సహా మరికొందరు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడటానికి రాహుల్ గాంధీయే ముఖ్య కారణమని అన్నారు. తాను తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరుకున్నప్పటికీ వారి చేతిలో ఏమీలేదని అన్నారు.
“ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పనిచేసిన దాంట్లో 1/50 పని చేసినా రాహుల్ సక్సెస్ అయ్యేవారు. రాజకీయాలంటే.. మొదట పార్టీ, ప్రజలు, దేశం పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. 2013లో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఆర్డినెన్స్‌ను చింపేయకుండా ఉంటే.. ఈరోజు రాహుల్ గాంధీ అనర్హత నుంచి బయటపడేవారు. అయితే, అప్పడు ఉన్నది బలహీనమైన క్యాబినెట్. రాహుల్ గాంధీ తిరస్కరించినా.. ఆ చట్టాన్ని తీసుకురావాల్సింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. ఆ సమయంలో నేను ఏం మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. ” -గులాం నబీ ఆజాద్, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు