మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టీసీ)కి చెందిన ఓ బస్ డ్రైవర్ ఆ రాష్ట్ర సీఎం కార్యాలయానికి లేఖ రాశాడు. మార్చి నుంచి పెండింగ్‌లో ఉన్న తన జీతమైనా చెల్లించాలని.. లేదా భారత్-చైనా సరిహద్దుకైనా పంపాలని కోరారు. యుద్ధంలో పోరాడి గర్వంగా దేశం కోసం చనిపోతానని లేఖలో పేర్కొన్నాడు. కాగా ఈ విషయం ప్రస్తుతం సంచలనం రేపుతోంది.
ఎంఎస్ఆర్టీసీలో 1999 నుంచి ముంబై సెంట్రల్ బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆనంద్ మనోహర్ హెల్గౌంగర్ అనే వ్యక్తి జూలై 2వ తేదీన మహారాష్ట్ర సీఎంవోకు పై విధంగా లేఖ రాశాడు. తన తల్లి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, మార్చి నెల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, జీతం రాకపోతే కుటుంబాన్ని ఎలా పోషించాలని, తల్లి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని అతను విచారం వ్యక్తం చేశాడు. అయితే దీనిపై మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కంగర్ సంఘటన చైర్మన్ సందీప్ షిండే స్పందిస్తూ.. ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని మాట వాస్తవమేనని తెలిపారు.
మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2వేల కోట్ల బెయిలవుట్ ప్యాకేజీని ఇప్పటికే కోరామని షిండే తెలిపారు. ప్రస్తుతం బస్సులు తగినంత సంఖ్యలో నడవడం లేదని.. అందువల్ల ఆర్టీసీకి విపరీతమైన నష్టాలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ముంబై తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఉండే ఆర్‌టీసీ ఉద్యోగులకు జీతాలను చెల్లిస్తున్నట్లు తెలిపారు. కానీ ముంబైలోని ఆర్టీసీ కార్మికులకే వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అయితే ఈ విషయంపై ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు.