తమ ఖాతాలోని డబ్బులు తమకు ఇవ్వాలని బ్యాంకులో రైతుల అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. ఆదిలాబాద్ రూరల్ భీంపూర్ మండలం వడూర్ గ్రామానికి చెందిన జిల్లెల మోహన్ ఖాతాలోని రూ.1 లక్ష, ఆదిలాబాద్ మండలంలోని యాపల్గూడ గ్రామానికి చెందిన రైతు నల్ల విలాస్ ఖతాలోని రూ.76 వేలు, నక్కల జగదీష్ ఖాతాలోని రూ.2 లక్షలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
అయితే, గత ఏడాది పత్తి పంటకు సంబంధించిన డబ్బును ఈ రైతులు పోస్టాఫీసు ఖాతాలో జమచేయగా.. గతేడాది అప్పటి పోస్టాఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్ సైబర్ క్రైం మోసానికి పాల్పడ్డాడు. దీంతో రైతులకు రావాల్సిన డబ్బులను ఢిల్లీ బ్యాంక్ హోల్డులో పెట్టింది.
ఆనాడు కొందరు రైతులు ఆందోళన చేయగా.. నాటి కలెక్టర్ రాజర్షి షా జోక్యంతో రైతులకు డబ్బులు చెల్లించారు. మరికొందరికి చెల్లింపులు కాలేదు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్ చౌక్‌లోని ఎస్బీఐ బ్యాంకులో కొందరు రైతులు చొక్కాలు విప్పి నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ తమ డబ్బులు తమకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.