తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. అక్కడ కొండమీద ప్రతి ఒక్క నిర్మాణానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అయితే చాలామందికి ఆయా నిర్మాణాలు, అక్కడి విశేషాలు తెలియవు. ముఖ్యంగా స్వామి వారి దేవాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న గొల్ల మండపం ఒక చారిత్రక నిర్మాణం. ప్రధాన ద్వారానికి ఎదురుగా విశాలమైన ప్రాంగణంలో సరిగ్గా ద్వారానికి ఎదురుగా సన్నగా, ఎత్తుగా ఒక మండపం ఉంటుంది. దానిమీద ధర్మ రక్షిత రక్షితః అనే బోర్డు ఉంటుంది. రక్షభటులు చుట్టూ ఉంటూ పహారా కాస్తారు. కానీ ఆ మండపాన్ని ఏమంటారు. ఎందుకు దాన్ని నిర్మించారు అనే విషయాలు చాలామందికి తెలియదు. ఆ మండపాన్ని గొల్ల మండపం అంటారు. ఎందుకు దాన్ని నిర్మించారో తెలుసుకుందాం….
పూర్వం తిరుమలేశుడికి కొన్ని ఉత్సవాలను తిరుచానూరులో నిర్వహించేవారు. అయితే శ్రీరామానుజాచార్యుల వారు తిరుమలేశుని ఉత్సవాలు అన్ని పూర్తిగా కొండమీదనే జరగాలని, అందుకోసం శ్రీవారి ఆలయం చుట్టూరా వీదుల్ని చదును చేసి, వెడల్పు చేయడం, మండపాలు కట్టించడం, అర్చకులకు ఇండ్లను నిర్మించడం, శ్రీవైష్ణవ మఠాల్ని కట్టించడం వంటి పనులు చేయాలని తీర్మానించారట. శ్రీరామనుజులవారు తమకు గురువైన తిరుమల నంబిని, శిష్యుడైన అనంతాళ్వారులను వీటి నిర్మాణాన్ని పర్యవేక్షించమని ఆదేశించారు. ఆ సమయంలో ఆయా పనుల్లో నిమగ్నమైన కూలీలను, పర్యవేక్షిస్తున్న వైష్ణవ స్వాములకు ఒక గోప వనిత మజ్జిగను ఉచితంగా ఇచ్చేదట. మిగిలినవారికి మాత్రం అమ్మేదట. అయితే చాలామంది ఎందుకు వారికి ఉచితంగా ఇస్తావు అని అడిగితే.. ఎండలో స్వామి సేవ చేస్తున్నవారికి చల్ల ఇస్తే నేను చల్లగా ఉంటాను, పుణ్ణెం వస్తుందట! స్వామిని చేరుకుంటానట! అని చెప్తుంది.
అయితే వారంతా అక్కడున్న తిరుమల నంబి, అనంతాళ్వారులను చూపించి వీరినడిగితే మోక్షం ఇప్పిస్తారని చెప్తారు. ఆ అమాయక గోపవనిత వారి దగ్గరికి వెళ్లి సాములూ! మీతో గోయిందస్వామి మాట్లాడుతారట గదా! మీరు చెపై నాకు వైకుంఠం వత్తదంట. ఇప్పించండి సామి! అని అడిగింది. వెంటనే ఆ ఇద్దరు గోపవనితను రేపు చెపుతాం తల్లీ అని దాటవేశారు. ఆ రాత్రి చల్లలమ్మే గొల్లస్త్రీ కోరికను ఏడుకొండలస్వామికి విన్పించారు. ఆమెకు వైకుంఠం ఇప్పించే శక్తి మీకు లేదు. రామానుజులు మాత్రమే ఇప్పించగలరని శ్రీనివాసుడు పలికాడట! ఆ విషయం తెల్లవారిన తర్వాత గోపవనితకు వారిద్దరు చెప్పారు.
కొన్ని రోజుల తర్వాత తిరుమలకు శ్రీరామానుజుల వారు వచ్చారు. ఆ గొల్ల స్త్రీ సాగిలబడింది. సాములూ! కొంచెం చల్ల తీసుకోండి సామీ! అంటూ భయం,భయంగా అడిగింది. కొందరు ఆమెను వారించబోతారు. రామానుజుల వారు తల్లీ!! ఇది శ్రీనివాస ప్రసాదం అంటూ స్వయంగా చల్లను తాగుతూ నీకు ఏం కావాలమ్మా అని అడిగారు. సాములూ మీరు చీటిరాసిస్తే నాకు వైకుంఠం వత్తాదంటా! ఈ జల్మానికి అదిప్పించండి చాలు సాములు అంటూ వంగి, వంగి దండాలు పెట్టింది. వెంటనే శ్రీరామనుజుల వారు ‘శ్రీనివాస పరబ్రహ్మ ముక్తిని ప్రసాదించుగాక అంటూ ఒక తాటాకును ఆమె చేతిలో పెట్టారట. అంతే వెంటనే ‘పెరుగమ్మే పడతి పరమపదం పొందింది. ఆమె పేరుతో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఎత్తైన నాలుగు స్తంబాల గొల్ల మండపాన్ని నిర్మించారని. ఈగాథకు గుర్తుగా వెలిసిందని జనశ్రుతి!!
ఇదండి గొల్లమండపం కథ. స్వామిని వేయినామాలు పెట్టి స్తుతించిన దానికంటే ఆయన భక్తులను సేవించినా, వారి గాథలను స్మరించినా స్వామికి మరింత ప్రీతి అని పురాణాలు పేర్కొన్నాయి. కాబట్టి స్వామి సేవలో తరించిన ఆ గొల్లవనితను, శ్రీరామానుజాచార్యులను స్మరించి ఆ గొల్లమండపాన్ని దర్శించండి. స్వామి కృప తొందరగా లభిస్తుంది.
– కేశవ