సాధారణంగా మనం పెళ్లిలో గరికె ముంతలను చూస్తుంటాం. అయితే వాటిని ఎందుకు వివాహంలో ఉపయోగిస్తారో తెలుసా? వాటి ప్రాధాన్యత ఏంటో తెలుసా? వీటికి సమాధానాలు చాలా మందికి తెలియకపోవచ్చు. నిజానికి గరికె ముంత లేకుండా కొన్ని సాంప్రదాయ వివాహాలు జరపరు. పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం అని చాలా మంది అనుకుంటారు. కానీ గరికె ముంతకు ఓ ప్రాధాన్యత ఉంది.
ఆంధ్ర దేశంలోనూ, రాయలసీమ లోనూ, తెలంగాణాలోనూ, కర్నాటకలోనూ కరగ అనే పేరుతోనూ తమిళంలో కరగం అనే పేరు తోనూ, ఇతర ఆంధ్ర ప్రాంతాలలో గరికె, గరిక, గరిగ,గరిగె అనే పేర్లు తోనూ పిలుస్తారు. ఎన్ని పేర్లతో పిలిచా ఆచారం మాత్రం ఒకటే అని చెప్పాలి. గరిక అంటే కుండ అని అర్థం. గరిగలను సేవించడం ద్వారా ఆమ్మవారిని సేవించి నట్లే భావింపబడుతుంది. ద్రౌపది తన వివాహ సమయంలో అనందావేశంతో ప్రక్క నున్న కలశాన్ని నెత్తిన పెట్టుకుని చిందులు వేసిందనీ, ఆ విధంగా అది పవిత్రం పొందిందని అంటారు.
పెళ్లిలో ‘ గరికె ముంత
ఇక ఆ నాటి నుండి ఈ నాటికీ కూడా వివాహ సమయంలో అన్ని ప్రాంతాలలోనూ గరికె ముంత, గరిగె బుడ్డి పెళ్లిలో ప్రాధాన్యమైంది. పెండ్లి సమయాలలో కుమ్మరి వారు అలివేణి కుండలతో పాటు ఈ గరికె ముంతను కూడ అందంగా రంగులతో చిత్రిస్తారు. దీనిని ఎంతో పవిత్రంగా చూస్తారు. ఆ ముంతతో పూజా విధాన ముగింపుతో దానిని తాకించి, మంత్రాలు చదువుతారు.
ఈ గరిక ముంతను పెండ్లికి ముందు రోజే కుమ్మరి ఇంటినుండి మేళ తాళాలతో వెళ్ళి, కుమ్మరి వారికి కానుకలు చెల్లించి, ఇంటికి తెచ్చి ఒక గదిలో ఉంచి దీపారాధన చేసి పూజిస్తారు. ముందుగా ఈ గరిగెలను పూజించటం గౌరి పూజగా భావిస్తారు. అంటే పెండ్లిండ్లలో గరికె గౌరీమాతకు ప్రతీకగా పూజ నందుకుంటుంది.
వివాహ సమయంలో గరికెను దంపతుల ముందుంచి మళ్ళ పూజచేసి, వివాహాన్ని పూర్తి చేస్తారు. వివాహం జరిగినంత సేపూ గరికె ముంత ఎంతో ప్రాముఖ్యం వహిస్తుంది. వధువు అత్తగారింటికి వెళ్ళే ముందు ఈ గరికను వధువుతో పంపించి పెండ్లి తరువాత కూడ దానిని పవిత్రంగా చూస్తారు. అప్పుడు గరిగ ముంతే గరికెగా మారిందంటారు.