కాంట్రాక్టు లెక్చరర్లకు శుభవార్త.. క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కసరత్తు..

-

తెలంగాణలో కాంట్రాక్టు లెక్చరర్లకు శుభవారత్త. జూనియర్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణకు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. శనివారం మంత్రుల నివాసంలోని క్లబ్ హౌస్‌లో జూనియర్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్ల కిక్కిరిసిన సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం సీఎం కేసీఆర్‌ ఫిబ్రవరి 26, 2016న జీవో16ను జారీ చేశారన్నారు వినోద్ కుమార్. కొంత మంది కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం కొలిక్కి రాకుండాపోయిందని, ఇటీవల కాలంలో కేసును కోర్టు కొట్టివేసిందని, ఆ తర్వాత ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేసిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

అయితే, కింది కోర్టులో కేసు ఓడిన వ్యక్తులు సుప్రీం కోర్టును ఆశ్రయించారన్న వినోద్ కుమార్ .. కాంట్రాక్టు లెక్చరర్ల పట్ల సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ విషయం కోసం పలు సూచనలు, సలహాలను కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి వినోద్‌కుమార్‌ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతోందని వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని, ఇదే విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ పలుమార్లు ప్రశంసించిందని గుర్తు చేశారు వినోద్ కుమార్. నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తుండడం, నీటి పారుదల సౌకర్యాలు పెంచడం, సంక్షేమ, అభవృద్ధి కార్యక్రమాలు భారీ ఎత్తున చేపట్టడం వంటి అనేక అంశాలు ఉన్నాయని వివరించారు వినోద్ కుమార్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version