తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత కొన్నేళ్లుగా లెక్చరర్లు లేక విద్యార్థుల చదువు ముందుకు సాగడం లేదు. దీంతో కాలేజీల్లో విద్యార్థుల ఆక్యూపెన్సీ సైతం తగ్గిపోతోంది. ఈ క్రమంలోనే ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. రెండేళ్ల కింద టీజీపీఎస్సీ ద్వారా 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
ప్రస్తుతం 1,139 పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇంటర్ కమిషనరేట్‌కు టీజీపీఎస్సీ అందజేసింది. మల్టీజోన్ 1లో 581 మంది ఉండగా, మల్టీజోన్ 2లో 558 మంది ఉన్నారు. ప్రధానంగా అరబిక్ సబ్జెక్టులో 2, బోటని 112, కెమిస్ర్టీ 123, సివిక్స్ 66, కామర్స్ 53, ఎకనామిక్స్ 87, ఫ్రెంచ్ రెండు, హిందీ 116, హిస్టరీ 83, మ్యాథ్స్ 156, ఫిజిక్స్ 120, సంస్కృతం 9, తెలుగు 55, ఉ ర్దూ 21, జువాలజీ 134 పోస్టులు ఉన్నాయి. వీరికి వారంలోనే నియామక పత్రాలు అందజేయనున్నారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తవడంతో పోస్టింగులు ఇవ్వనున్నారు.