లాక్ డౌన్ ప్రభావం తో ఇప్పుడు ఏ ఒక్క ఉద్యోగి కూడా కనపడట౦ లేదు. ప్రజలు ఇబ్బంది పడినా ఏది పడినా సరే ఎవరూ బయటకు రావడం లేదు. అత్యవసర సేవలు మినహా ఏ ఒక్కటి అందుబాటులో ఉండటం లేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎక్కువగా కష్టపడుతున్నారు. కరెంటు బిల్లు రీడింగ్ తీసేందుకు బిల్ కలెక్టర్లు కూడా ఇప్పుడు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది(2019) మార్చిలో వచ్చిన కరెంట్ బిల్లునే ఈ నెలలో కట్టుకోవచ్చని వినియోగదారులకు సూచనలు చేసింది. ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే సరిపోతుందని, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల విషయానికి వస్తే గత ఏడాది మార్చిలో వచ్చిన బిల్లులో సగం మొత్తాన్ని కట్టాలని పేర్కొంది. గత ఏడాది మార్చికి సంబంధించిన బిల్లుల వివరాలను విద్యుత్తు పంపిణీ సంస్థలు నేరుగా ఫోన్‌కు సందేశం పంపిస్తారు.
లాక్‌డౌన్ వల్ల మీటర్ రీడింగ్ తీసుకునే అవకాశం లేకపోవడంతో డిస్కంలకు ఈ వెసులుబాటు కల్పిస్తూ టీఎస్ఈఆర్సీ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. లాక్‌డౌన్ ముగిశాక మీటర్ రీడింగ్ తీసుకొని బిల్లు చెల్లించే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ బిల్లు చెల్లిస్తే తర్వాత సర్దుబాటు చేస్తారు. తక్కువ బిల్లు చెల్లిస్తే వచ్చే నెలలో కలిపి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.