కరోనాపై పోరు.. వంద కోట్ల డాలర్ల విరాళం ప్రకటించిన ట్విట్టర్‌ సీఈఓ

-

ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి నియంత్రణ కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు కరోనా నివారణ చర్యల కోసం భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ట్విట్టర్‌ సీఈఓ జాన్‌ డోర్సీ ఆ జాబితాలో చేరిపోయారు. కరోనాను నిరోధించేందుకు చేయూతగా 1 బిలియన్‌(100 కోట్లు) డాలర్లు ఇస్తున్నట్టు వెల్లడించారు. తన ఆన్‌లైన్‌ ఆర్థిక సేవల సంస్థ స్క్వేర్‌ నుంచి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు తెలిపారు. తన ఛారిటీ  సంస్థ స్టార్ట్ స్మాల్ ఎల్‌ఎల్‌సి  ద్వారా గ్లోబల్ కోవిడ్ -19 రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్టు చెప్పారు. ఇది తన సంపదలో 28 శాతం ఉంటుందని పేర్కొన్నారు.

అయితే కరోనా మహమ్మారితో యుద్ధం ముగిశాక బాలికల ఆరోగ్యం, విద్యపై తాము దృష్టి సారించనున్నట్టు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ఓ పోస్ట్‌ చేశారు. ‘మన జీవిత కాలం చాలా చిన్నది. ఈ అతి తక్కువ కాలంలో తోటి ప్రజలకు ఉపయోగపడే పనులు ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. నా నిర్ణయం మరింత మందికి ప్రేరణ ఇస్తుందని ఆశిస్తున్నాను’ అని జాక్‌ పేర్కొన్నారు.

కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. పలు దేశాలను ఆర్థికంగా దెబ్బతిస్తోంది. మరోవైపు ఇప్పటివరకు 14 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 82 వేలకు పైగా మృతిచెందినట్టుగా గణంకాలు చెప్తున్నాయి. అత్యధికంగా అమెరికాలో 4లక్షల మందికి పైగా కరోనా సోకింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version