ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై సమన్వయంతో పని చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఏపీ ప్రజల ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయని.. ఇరు ప్రభుత్వాల అధికారుల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు చెప్పారు.
భూకేటాయింపు, ఇతర అంశాలపై రాష్ట్ర సర్కారు నుంచి పూర్తి సహకారం ఉందని వెల్లడించారు. అతిత్వరలోనే విశాఖ రైల్వే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన సన్నాహాలకు సిద్ధమవుతామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మరోవైపు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం విషయంలో ఆలస్యం జరుగుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం అడిగిన 52 ఎకరాల భూమిని పమకూర్చడంలో జాప్యం జరిగింది. తాజాగా రైల్వేశాఖ మంత్రి ప్రకటనతో ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.