తెలంగాణ ప్రజలకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా శుభవార్త అందించారు. మంగళవారం మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా 75 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రభుత్వ ఆసుపత్రులకు అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతర పర్యవేక్షణకు మూడు రకాల టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతుల కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. వైద్య రంగంలో రెగ్యులేటరి పవర్స్‌ను అమలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైద్య శాఖలో ప్రక్షాళన మొదలైందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఉస్మానియా ఆస్పత్రిని పట్టించుకోలేదని మండిపడ్డారు.