తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది. తెలంగాణ లోని మెదక్ జిల్లాలో నేషనల్ హైవే-765డి పరిధిలోని మెదక్-యల్లారెడ్డి రహదారిని 2 లేన్ల రహదారిగా మార్చే ప్రాజెక్టు కు కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన చేశారు. రెండేళ్ళల్లో మొత్తం 399.01 కోట్ల రూపాయలతో 43.910 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుందని.. ఈ రహదారి నిర్మాణం వల్ల వెనుకబడిన జిల్లాలైన కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ మధ్య సౌకర్యవంతంగా మరింత రాకపోకలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
సరస్వతీ దేవాలయం ఉన్న బాసర పట్టణానికి కూడా ఈ రహదారి మార్గం అనుసంధానం అవుతుందన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో నేషనల్ హైవే-365ఏ కు చెందిన ఖమ్మం-కురవి రహదారిని 2-లేన్ల రహదారిగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని ట్వీట్ చేశారు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. రెండేళ్ళలో మొత్తం 445.76 కోట్ల రూపాయలతో 37.43 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుందని ప్రకటించారు.
ఖమ్మం పట్టణం చుట్టూ అనేక గ్రనైట్ పరిశ్రమలున్న ఖమ్మం జిల్లా గుండా ఈ రహదారి వెళ్తుందని.. ఈ రహదారి అభివృధ్ది వల్ల రవాణా పెరగడంతో పాటు, గ్రనైట్ ఉత్పత్తుల ఎగుమతులు కూడా పెరుగుతాయని చెప్పారు. అలాగే, పర్యాటక క్షేత్రాలైన కురవి వీరభద్ర స్వామి, భద్రకాళి దేవాలయాలకు మరింత సౌకర్యవంతమైన రహదారి మార్గం ఏర్పడుతుందని వెల్లడించారు.