ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలోని సుదూర ప్రాంతాల ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ రేట్లను యాజమాన్యం తగ్గించింది. ఈ మేరకు రిజర్వేషన్ సదుపాయమున్న ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సు సర్వీసుల్లో చార్జీలను తగ్గిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎక్స్ ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో 350 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి రూ.20, 350 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే రూ.30గా రుసుములను నిర్ణయించింది. సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో మాత్రం ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే రూ.30 వసూలు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. సవరించిన ఛార్జీలు వెంటనే అమల్లోకి వస్తాయని సంస్థ పేర్కొంది.
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు మంచి స్పందన వస్తుందని ఎండీ సజ్జనార్ తెలిపారు, రోజుకు సగటున 15 వేల మంది టికెట్లు బుక్ చేసుకుంటున్నారని, వారికి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఈ సదుపాయాన్ని ప్రయాణికులందరూ ఉపయోగించుకుని.. సంస్థను ఆదరించాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు.