కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు చాలా వరకు ఇంటి నుంచే పనిచేసే సదుపాయం కల్పిస్తున్న విషయం విదితమే. దాదాపుగా 75 శాతం ఉద్యోగులు ప్రస్తుతం ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. అయితే వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల వీక్ ఆఫ్‌లలోనూ పనిచేయాల్సి వస్తుందని, రోజుకు 24 గంటలూ అందుబాటులో ఉండాల్సి వస్తుందని ఉద్యోగులు ఫీలవుతున్నారు. దీంతో పనిభారం, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయని అంటున్నారు. అయితే ఇందుకు గాను ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులకు మరొక రోజును అదనపు వీకాఫ్‌గా ఇస్తున్నట్లు తెలిపింది.
గూగుల్ సంస్థలో పనిచేస్తున్న శాశ్వత, తాత్కాలిక సిబ్బంది ఇకపై వారంలో 3 రోజుల పాటు వీకాఫ్‌లు పొందవచ్చు. సాధారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలకు వారంలో రెండు రోజులు.. అంటే.. శని, ఆదివారాల్లో వీకాఫ్ ఉంటుంది. అయితే ఇకపై అదనంగా శుక్రవారం కూడా వీకాఫ్ తీసుకునే అవకాశాన్ని గూగుల్ కల్పించింది. తాము కుటుంబ సభ్యులతో గడపలేకపోతున్నామని, ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టలేకపోతున్నామని, వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల ఎల్లప్పుడూ కంపెనీకి అందుబాటులో ఉండాల్సి వస్తుందని.. దీంతో పనిభారం, ఒత్తిడి పెరుగుతున్నాయని.. చెప్పడంతోనే గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే అత్యవసర పరిస్థితుల్లో పనిచేసే వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు మాత్రమే శుక్రవారం అదనపు వీకాఫ్‌ను తీసుకునేందుకు అవకాశం ఉంటుందని గూగుల్ తెలిపింది. అయినప్పటికీ గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు మేలు చేస్తుందని భావిస్తున్నారు.