తెలంగాణ శాసన సభ సమావేశాల సందర్భంగా .. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శనివారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను పోరాడి సాధించుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు… ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారం అయిందని గవర్నర్ నరసింహన్ అన్నారు. రైతాంగానికి తగిన ప్రాధాన్యతను కల్పించి రైతే రాజు అనే విధంగా ప్రభుత్వ పాలన సాగిస్తుందని తెలిపారు. విద్యుత్ కోతలను అధిగమించి ప్రభుత్వం తొలి విజయం సాధించిందని చెప్పారు. పారిశ్రామిక, ఐటీ రంగంలో పారదర్శక విధానాలు అమలవుతున్నాయని గవర్నర్ అన్నారు.
వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మారుమూల పల్లెలు, తండాలకు స్వయంగా పాలించుకునే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించిందని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వం మరింత మెరుగ్గా పనిచేస్తుందని ఆయన తెలిపారు. గవర్నర్ ప్రసంగం అనంతరం, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎం కేసీఆర్, శాసన సభ్యులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.