నగరంలో తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి సెప్టెంబర్ 2వ తేదీ నుండి శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కలెక్టర్ లు అనుదీప్ దురిశెట్టి, హరీష్, అమయ్ కుమార్, హౌసింగ్ సీఈ సురేష్ లతో సమావేశం నిర్వహించారు.
మొదటి విడతగా 12వేల మంది లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించనున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చి తన ఉదారత్వాన్ని చాటుకున్నారని మంత్రి తలసాని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, డ్రైనేజీ, వాటర్, విద్యుత్ వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి పేదలకు ఉచితంగా అందజేస్తుందని చెప్పారు.