టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేడు మంగళగిరి నియోజకవర్గంలో పునఃప్రారంభమైంది. నిన్న ఒక్కరోజు కోర్టు పని కారణంగా పాదయాత్రకు విరామం ఇవ్వగా… ఇవాళ రాజధాని ప్రాంతంలోని చంద్రబాబు నివాసం నుంచి లోకేశ్ తన పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ సాయంత్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. టీడీపీ యువనేత రాకతో ప్రకాశం బ్యారేజి జనసంద్రంలా మారింది. లోకేశ్ కు 150కి పైగా పడవలతో స్వాగతం పలికారు.
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పేదలకు అమరావతి రాజధానిలో ఇళ్ల స్థలాల ఆశ చూపించి ఓట్లు పొందాలని వైసీపీ వేసిన ఎత్తుకు తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ పైఎత్తు వేశారు. నియోజకవర్గంలోని 20 వేల మంది పేదలకు అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని శనివారం స్పష్టమైన హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర నేడు 2,500 కిలోమీటర్ల మైలురాయిని ఉండవల్లి సమీపంలో అధిగమించింది. అక్కడే 20 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల హామీ శిలాఫలకాన్ని ఆవిష్కరించి కృష్ణా జిల్లాలోకి యువ నేత అడుగుపెట్టారు.