క‌రోనా వైర‌స్‌కు ప‌రిష్కారం కనిపెట్టండి.. రూ.1 ల‌క్ష బ‌హుమ‌తి అందుకోండి..

-

దేశవ్యాప్తంగా కరోనా వైర‌స్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. సోమ‌వారం వ‌ర‌కు దేశ వ్యాప్తంగా క‌రోనా బాధితుల సంఖ్య 114కు చేరుకుంది. ఇద్ద‌రు క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనాకు అడ్డుక‌ట్ట వేసేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అయితే ప్ర‌ధాని మోదీ క‌రోనా వైర‌స్‌ను అడ్డుకునేందుకు దేశంలోని ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు తోచిన స‌ల‌హాలు, సూచ‌న‌లు, పరిష్కార మార్గాలు తెలియ‌జేయాల‌ని కోరారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని, అయితే చాలా మంది ఈ వైర‌స్‌ను నియంత్రించేందుకు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తున్నార‌ని, కానీ వారు https://innovate.mygov.in/covid19/ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి త‌మ స‌ల‌హాలు, సూచ‌న‌లు, ప‌రిష్కార మార్గాల‌ను తెలియ‌జేయ‌వ‌చ్చ‌ని అన్నారు. కాగా ఈ సైట్‌లో ఔత్సాహికులు, స్టార్ట‌ప్ కంపెనీలు లేదా ప‌రిశ్ర‌మ‌లు ఎవ‌రైనా స‌రే.. త‌మ స‌ల‌హాలు, సూచ‌న‌లు, క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కావ‌ల్సిన ప‌రిష్కార మార్గాల‌తోపాటు అందుకు అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని పీడీఎఫ్ డాక్యుమెంట్ రూపంలో అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు. లేదా యూట్యూబ్ వీడియోలో వివ‌ర‌ణ ఇచ్చి ఆ వీడియో లింక్‌ను ఆ సైట్‌లో పోస్ట్ చేయ‌వ‌చ్చు.

ఇక పైన తెలిపిన సైట్‌లో ఎవ‌రైనా స‌రే.. త‌మ సూచ‌న‌లను పంపించేందుకు మార్చి 31వ తేదీని ఆఖ‌రి తేదీగా నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో అంద‌రూ పంపే సూచ‌న‌ల‌ను అధికారులు ప‌రిశీలించి వాటిలో ఉత్త‌మ‌మైన స‌ల‌హాల‌ను ఎంపిక చేస్తారు. ఇక అత్యుత్త‌మ‌మైన స‌ల‌హాల‌కు ప్ర‌థ‌మ, ద్వితీయ‌, తృతీయ బ‌హుమ‌తుల కింద రూ.1 ల‌క్ష‌, రూ.50వేలు, రూ.25వేల న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను పొంద‌వ‌చ్చు. అయితే క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సాంకేతిక త‌రహా ప‌రిష్కార మార్గాల‌ను త‌మ‌కు సూచించాల‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. మ‌రింకెందుకాల‌స్యం.. క‌రోనాను అడ్డుకునేందుకు మీ వ‌ద్ద ఏదైనా సొల్యూష‌న్ ఉంటే వెంట‌నే ఆ సైట్‌లో తెలిపి.. ప్ర‌థ‌మ బ‌హుమ‌తి కింద రూ.1 ల‌క్ష ప‌ట్టేయండి మ‌రి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version