కాంగ్రెస్ ఆరు, ఎన్సీపీ ఏడు… శివసేనకు చుక్కలు చూపిస్తున్నారా…?

-

మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికార పీఠం నుంచి పక్కకు జరిగిన తర్వాత శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా సరే బిజెపిని నిలువరించేందుకు ఈ మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ మూడు పార్టీల్లో ఎక్కువ సీట్లున్న శివసేన ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో జాగ్రత్తగా ముందుకి వెళ్తుంది. అటు ఎన్డీయే నుంచి బయటకు రావాలి అని శివసేనకు ఎన్సీపీ సూచించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు… అరవింద్ సావంత్.

ఇప్పుడు కాంగ్రెస్ ఎన్సీపీ నుంచి శివసేనకు కొన్ని విజ్ఞప్తులు, షరతులు వెళ్తున్నాయని తెలుస్తుంది. తమకు ఏం ఏం కావాలో కాంగ్రెస్, ఎన్సీపీ శివసేన ముందు ప్రతిపాదనలు ఉంచుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్… తమకు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు ఆరు మంత్రి పదవుల కోసం డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వీటిల్లో హోమ్, ఆర్ధిక, రెవెన్యూ, జలవనరుల్లో ఒకటి కోరుతున్నాయి. ఇక ఎన్సీపీ కూడా ఇదే డిమాండ్ ని శివసేన ముందు ఉంచింది. తమకు 7 మంత్రి పదవులతో పాటుగా…

ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య, రెవెన్యూ, గనుల శాఖలు కావాలని డిమాండ్ చేస్తుంది. హోమ్ శాఖ కాంగ్రెస్ కి ఇస్తామంటే తమకు ఏ ఇబ్బంది లేదని చెప్పినట్టు సమాచారం. ఇక ఎన్డీయే నుంచి బయటకు రావాలని కూడా ఎన్సీపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే… కాంగ్రెస్ నుంచి మరిన్ని షరతులు వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఎమ్మెల్సీ పదవుల విషయంలో కూడా తమకు రెండు కావాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. మరి వీటికి శివసేన ఏ విధంగా అంగీకారం తెలుపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version