తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 38వ రోజుకు చేరింది. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ తీర్మానాన్ని హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్దమని పిటిషనర్ తరపు న్యాయవాది వాధనలు వినిపించారు. ఆర్టీసీని పబ్లిక్ యుటిలిటీ సర్వీస్‌గా ప్రకటించినందున.. ఎస్మా పరిధిలోకి వస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాధించారు.
పబ్లిక్ యుటిలిటీ సర్వీస్‌లన్నీ అత్యవసర సర్వీసులు కావని హైకోర్టు పేర్కొంది. ఎస్మా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం జీవో ఇస్తేనే అత్యవసర సర్వీసుగా ఉంటుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సమ్మె చట్టవిరుద్ధమని మరోసారి హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. సమ్మెను చట్టవిరుద్ధమని చెప్పలేమని హైకోర్టు తెలిపింది. కాగా, పిటీషన్ విచారణ జరిపిన ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.