జుత్తాడ మర్డర్స్ : విజయ్ కి ప్రభుత్వ ఉద్యోగం

విశాఖ జిల్లా జుత్తాడలో సంచలనం రేపిన ఆరుగురి హత్య కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జుత్తాడ గ్రామంలో చనిపోయిన విజయ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. A1 అప్పలరాజు ని ఈ రోజే పోలీస్ కస్టడీకి తీసుకోవాలి అని కోరామన్న ఆయన ఈ కేసులో A2 గా ఉన్న బత్తిన శీను ని సస్పెండ్ చేయమని సీపీ ని కోరామని అన్నారు. బత్తిన శీను హస్తం కూడా ఉందని రుజువైతే అతనిపై కూడా కఠిన చర్యలు తప్పవని అన్నారు.

14 రోజులు దాటితే ఇంకా అప్పలరాజు ని కస్టడీకి తీసుకునే అవకాశం ఉండదని ఆయన అన్నారు. వైసీపీ పార్టీ తరఫున చనిపోయిన వారికి నష్టపరిహారం కింద ఒక్కొక్కరికి 2 లక్షలు మొత్తం 12 లక్షలు చొప్పున చెల్లిస్తామని అన్నారు. కుటుంబాన్ని కోల్పోయిన విజయ్ కు, లీలావతికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆయన అన్నారు. విజయ్ కుమారుడు కి ఉన్నత చదువులు చదివిస్తామన్న ఆయన A1 అప్పలరాజు ని ఇంతవరకు కస్టడికి తీసుకోకపోవడం దారుణమని అన్నారు. ఈ కేసును సీరియస్ గా తీసుకోమని కమిషనర్ కు చెప్పామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరినట్టు తెలిపారు.