ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వేల గోల ఎక్కువైపోయింది. ఇంకా ఎన్నికలకు సమయం ఉండగానే..ఇప్పటినుంచే సర్వేల హడావిడి ఎక్కువైపోయింది. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ సర్వే అంటూ ఎప్పుడు ఏదొక కథనం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్…ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ కోసం, అటు ఏపీలో వైసీపీ కోసం పనిచేస్తున్నారు. రెండు అధికార పార్టీల కోసం పనిచేస్తూ..మళ్ళీ ఆ పార్టీలని అధికారంలోకి తీసుకోచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే తన టీం ద్వారా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిస్తితులని తెలుసుకుని…కేసీఆర్, జగన్ లకు వివరిస్తున్నారు.
ఇదే క్రమంలో పలు సర్వే రిపోర్టులు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఏపీకి సంబంధించి..పీకే టీం ఒక సర్వే నివేదికని జగన్ కు అందించినట్లు సమాచారం. ఆ సర్వేలో వైసీపీకి వ్యతిరేకంగా ఊహించని రిజల్ట్ కనిపించిందని టాక్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి కేవలం 35 సీట్లు మాత్రమే వస్తాయని తేలిందట. ఆ సర్వే చూసి సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట.
అయితే ఇదంతా అంతర్గతంగా జరిగిన అంశం…కానీ ఇది ఎలా బయటకొచ్చిందని డౌట్ రావొచ్చు…ఇక్కడే టీడీపీ అనుకూల మీడియా ఓ లాజిక్ చెబుతుంది…తమకున్న సీక్రెట్ వర్గాల ద్వారా పీకే టీం సర్వే నివేదిక గురించి తెలుసుకున్నామని టీడీపీ అనుకూల మీడియా అంటుంది. వైసీపీకి 35 సీట్లు మాత్రమే వస్తాయని, ఆ సర్వే చూసి జగన్ ఫైర్ అయ్యారని టీడీపీ అనుకూల మీడియాలోనే ఓ డిబేట్ కూడా నడిచింది.
అంటే ఇదంతా టీడీపీ అనుకూల మీడియా సృష్టి…ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయో ఎవరికి క్లారిటీ లేదు…అంతర్గతంగా నడిచే విషయాలు టీడీపీ మీడియాకు ఎలా తెలిసిందో ఎవరికి తెలియదు. కానీ మొత్తానికి పీకే టీం సర్వే అంటూ హడావిడి చేసేశారు. దీని వల్ల వైసీపీ పని అయిపోయిందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ కథనాలు ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది చూడాలి.