మే నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్ లో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఆయన సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు ,ట్రాన్స్ పోర్ట్, వరి కొనుగోలు ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లక్షా 30 వేల మెట్రిక్ టన్నుల అంచనా ఉందన్నారు. జిల్లాలో 10 బాయిల్డ్ 33 రా రైస్ మిల్లు లతోపాటు మొత్తం 43 రైస్ మిల్లులు ఉన్నాయని, వీటికి తోడు 185 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
అందులో 86 కేంద్రాలను ప్రారంభించి ఇప్పటి వరకూ ఏడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. వర్షాలు పడే సూచనలు కనపడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరికీ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వీలైనంత త్వరగా కొనుగోలు పూర్తి చేయాలని అన్నారు. దీనికి సంబంధించిన కంట్రోల్ రూమ్ నుండి మానిటర్ చేస్తున్నట్లు వెల్లడించారు.