ఏలూరు కార్పోరేషన్ ఓట్ల కౌంటింగ్ కు గ్రీన్‌సిగ్నల్

విజ‌య‌వాడ‌ : ఏలూరు మున్సిప‌ల్ కార్పోరేషన్ ఓట్ల కౌంటింగ్ కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇందులో భాగంగానే ఏలూరు మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల కౌంటింగ్ ను ఈనెల 25 న నిర్వహించాల‌ని నిర్ణయించింది ఏపీ ఎన్నిక‌ల సంఘం. దీనికి సంబంధించి ఇవాళ నోటిఫికేష‌న్ ను కూడా విడుద‌ల చేశారు ఎన్నిక‌ల సంఘం కార్యద‌ర్శి కె క‌న్నబాబు.

మార్చి 10 న ఏలూరు మున్సిప‌ల్ కార్పోరేష‌న్ కు ఎన్నిక‌లు జ‌రిగాయాంటూ నోటీసులో పేర్కోన్న ఎస్ఈసి…. కౌంటింగ్ ప్రక్రియ‌లో కోవిడ్ నిభంద‌న‌లు ప‌క్కాగా పాటించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. పోటీ చేసిన వారు త‌మ కౌంటింగ్ ఏజెంట్లను నియమించడంపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 24 సాయంత్రం 5 గంట‌ల్లోగా ఫార్మెట్ ప్రకారం ఏజెంట్ల నియామకాల ధ‌ర‌ఖాస్తుల‌ను రిట‌ర్నింగ్ అధికారికి అందించాల‌ని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ఎన్నికల సంఘం. ఎస్‌ఈసీ తాజా నిర్ణయంతో ఈ నెల 25న కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. ఆ వెంటనే ఫలితాల ప్రకటన కూడా ఉండనుంది. కాగా… ఈ ఏడాది మార్చి 10వ తేదీన ఏలూరు మున్సిప‌ల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగాయి. కోర్టు ఆదేశాలతో ఆ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఆగిన సంగతి తెలిసిందే.