హైదరాబాద్ మహా నగరం చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్న విషయం తెలిసిందే. ఈ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో మొదటి అడుగు పడింది. రీజినల్ రింగ్ రోడ్డుకు ఉత్తర భాగానికి సంబంధించి తొలి నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గెజిట్ నోటిఫికేషన్ ను ఆమోదిస్తు.. సంతకం చేశారు.
దీంతో ఈ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే దీనికి భూ సేకరణ నోటిఫికేషన్ జత చేసి విడుదల చేయనున్నారు. కాగ రీజినల్ రింగ్ రోడ్డు ఈ ఉత్తర భాగానికి సంబంధించి నాలుగు జిల్లాల పరిధిలోని 15 మండలాల్లో మొత్తం 113 గ్రామాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. ఈ రోడ్డు నిర్మాణానికి 1,904 హెక్టార్ల భూమి అవసరం అని గెజిట్ లో కేంద్ర ప్రభుత్వం పొందుపర్చినట్టు సమాచారం. ఈ ఉత్తర భాగం రోడ్డు సంగారెడ్డి వద్ద ప్రారంభం అయి.. చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది.