గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి ఓ వైపు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు ఇతర పార్టీల నుంచి బలమైన క్యాడర్ ఉన్న నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గుజరాత్ లోని ప్రతిపక్ష కాంగ్రెస్‌కు భారీ షాక్ ఇచ్చింది బీజేపీ. ఆ పార్టీ నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్‌సిన్హ్ రత్వాను బీజేపీ తన గూటిలో చేర్చుకుంది. దాదాపు 2 దశాబ్దాలుగా అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్న హస్తం పార్టీకి ఇది మింగుడుపడని అంశమే. చోటా ఉదయ్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రత్వా.. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ ఠాకూర్‌కు పంపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్‌సిన్హ్ రత్వాకు గిరిజన ఓటు బ్యాంకుపై మంచి పట్టుంది. తాజా ఎన్నికల్లో తాను పోటీ చేయనని, చోటా ఉదయ్‌పూర్ స్థానాన్ని తన కుమారుడు రాజేంద్రసిన్హ్ రత్వాకు కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరారు. కానీ, ఆ స్థానాన్ని తన కొడుక్కే ఇవ్వాల్సిందిగా ఎంపీ నరన్ రత్వా పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విభేదాల నేపథ్యంలోనే మోహన్ సిన్హ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.