మట్టితో తయారు చేసిన కుండల్లో నీరు చల్లగా అవుతుంది తెలుసు కదా. ఇదే సూత్రంతో గుజరాత్‌లోని వడోదరకు చెందిన మనోజ్ పటేల్ అనే వ్యక్తి ఓ సహజసిద్ధమైన ఏసీని తయారు చేశాడు.
ఎన్ని ఈఎంఐ స్కీములు ఉన్నా.. మధ్య తరగతి వారికి ఏసీ కొనడం కొంత సులభమే అయినప్పటికీ.. దాన్ని మెయింటెయిన్ చేయడం అంత ఆషామాషీ కాదు. దాన్ని ఉపయోగించినా.. ఉపయోగించకపోయినా.. మినిమం మెయింటెనెన్స్ తప్పనిసరి. ఇంకా వేసవిలో ఎడా పెడా ఏసీ వేస్తే వచ్చే కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుంది. అయితే ఆ వ్యక్తి తయారు చేసిన ఏసీలకు కరెంటు బిల్లు రాదు. ఇంకా చెప్పాలంటే.. అస్సలు వాటికి కరెంటే అవసరం లేదు. అవును, షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే.
మట్టితో తయారు చేసిన కుండల్లో నీరు చల్లగా అవుతుంది తెలుసు కదా. ఆ కుండకు ఉండే సూక్ష్మ రంధ్రాల్లోంచి వెళ్లే గాలి ఆవిరి అవడం ద్వారా కుండలో ఉండే నీరు చల్లబడుతుంది. అయితే ఇదే సూత్రంతో గుజరాత్‌లోని వడోదరకు చెందిన మనోజ్ పటేల్ అనే వ్యక్తి ఓ సహజసిద్ధమైన ఏసీని తయారు చేశాడు. దాని ధర కేవలం రూ.800 కావడం విశేషం. దాంతో గది అంతా చల్లగా మారుతుంది. ఇక ఆ ఏసీకి కరెంటు అవసరం లేదు.
కాగా మనోజ్ మొత్తం 3 రకాల ఏసీలను తయారు చేయగా.. ఒక ఏసీలో పైన ట్యాంకులో నీళ్లుంటాయి. ఆ నీళ్లు ఎంత మోతాదులో ఉన్నాయో తెలియజేసేందుకు ఒక సూచిక ఉంటుంది. దాంతోపాటు అక్కడే ఒక మొక్కను పెంచుకునేందుకు ఏర్పాటు ఉంటుంది. ఇక ఈ ఏసీ వల్ల గది ఉష్ణోగ్రత 32 నుంచి 23 డిగ్రీలకు చేరుకుంటుంది. అలాగే మరొక ఏసీని అతను పింగాణీతో తయారు చేశాడు. అందులో చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. ఇక ఈ ఏసీల్లో ట్యాంకును ఒక్కసారి నింపితే 10 నుంచి 12 రోజుల వరకు ఆ నీటినే వాడుకోవచ్చు. ఈ క్రమంలోనే మనోజ్ తయారు చేసి ఆ ఏసీలు ఇప్పుడు స్థానికులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి వీటిని అతను వాణిజ్యపరంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తాడో చూడాలి..!