ఇద్దరు అగ్నివీరులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. మహరాష్ట్రలోని నాసిక్ జిల్లా ఆర్టిలరీ సెంటర్లో అనుకోకుండా ప్రమాదం చోటుచేసుకుంది. గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి షెల్ మిస్ ఫైర్ కావడంతో ఇద్దరు అగ్నివీరులు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారని పోలీసులు తెలిపారు. ప్రాక్టీస్ సెషన్లో షెల్ మిస్ ఫైర్ కావడంతో గోహిల్ విశ్వరాజ్ సింగ్ (20), సెఫత్ షిత్ (21) తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే వారిని డియోలాలిలోని ఎంహెచ్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆర్మీ హవల్దార్ అజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.