చాలా మంది చర్మానికి ఇచ్చే ప్రాముఖ్యత జుట్టుకి ఇవ్వరు. చర్మంపై చూపే శ్రద్ధలో సగభాగం కూడా జుట్టుపైన పెట్టరు. ఐతే చర్మ సంరక్షణకి ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నారో జుట్టు ఆరోగ్యానికీ అంత ప్రాముఖ్యం తప్పక అవసరం. చింపిరి చింపిరిగా ఉన్న జుట్టుని ఆరోగ్యంగా మృదువుగా తయారు చేసుకోవడానికి ఇంట్లోనే హెయిర్ మాస్కులని తయారు చేసుకోవచ్చు.
మీ ముఖారవిందం కోసం తయారు చేసుకునే మాస్క్ లాగే జుట్టుకి కూడా మాస్క్ తయారు చేసుకోవచ్చు. దీనివల్ల జుట్టు మొదలు భాగంలో ఉండే చిన్నపాటి రంధ్రాలు మూసుకుపోకుండా ఉంటాయి. వాటివల్ల వెంట్రుకలు పాడవకుండా ఉంటుంది. ఈ హెయిర్ మాస్క్ ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
అరకప్పు గ్రీన్ టీని మరిగించి పక్కన పెట్టుకోవాలి. బెంటోనైట్ బంకమట్టిని రెండు నుండి మూడు ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఈ బంకమట్టి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు బంకమట్టిని గ్రీన్ టీలో మిక్స్ చేయాలి. అవి పూర్తిగా ఒకదానితో ఒకటి మిక్స్ అయ్యే వరకు బాగా కలపాలి. అప్పుడు ఆ మిశ్రమాన్ని మీ నెత్తిపై అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత 15నిమిషాలకి చల్లని నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుంది.
బంకమట్టి వల్ల నెత్తిపై ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి. ఇది జుట్టు లోపలికి బాగా చొచ్చుకుపోయి అక్కడ పేరుకున్న మలినాల్ని తొలగిస్తుంది. పేలవమైన, చింపిరిగా ఉన్న జుట్టుని ఆరోగ్యంగా చేసేందుకు బంకమట్టి బాగా ఉపయోగపడుతుంది. అలాగే గ్రీన్ టీ లో ఉండే పోషకాలు చుండ్రుని పోగొట్టి జుట్టు రాలిపోకుండా కాపాడతాయి. జుట్టు బాలేదన్న కారణస్ంగా ఇబ్బందులు పడుతుంటే ఈ హెయిర్ మాస్క్ ని వాడండి.