బార్బర్ సేఫ్… కస్టమర్స్ బుక్!

-

కరోనా వైరస్ ఎంత తీవ్రమైంది… ఎంత సులువుగా అంటుకుంటుంది… అన్న విషయాలపై అవగాహనలేదనుకోవాలో… నిర్లక్ష్యం అనుకోవాలో లేక అంతకుమించి ఏమైనా అనుకోవాలో తెలియడం లేదు.. రోజూ వెలుగులోకి వస్తున్న కొన్ని విషయాలను చూస్తుంటే! ప్రశాంతంగా ఇంట్లో కూర్చోండయ్యా అంటే… ఏదో వంకన రోడ్డెక్కడం, ఖాళీగా ఉన్నాం కదా అని బార్బర్ షాపులో కూర్చోవడం చేశారు కొందరు పెద్దమనుషులు! సరే వారి పరిస్థితి అలా ఉంటే… కనీసం ఆలోచన లేకుండా కక్కుర్తి పనికి పూనుకున్నాడు సదరు బార్బర్…. ఫలితం 6 కరోనా పాజిటివ్స్ రావడం!

అవును… దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎంతో కఠినంగా అమలవుతున్నా, మధ్యప్రదేశ్ లోని కొన్ని గ్రామాల్లో బార్బర్ షాపులు చాలా చోట్ల తెరిచే ఉంటున్నాయంట. తాజాగా అలా తెరిచి ఉన్న బార్బర్ షాపు వల్ల కరోనా వైరస్ వ్యాపించినట్లు గుర్తించామని జిల్లా వైద్య అధికారులు చెబుతున్నారు! ఇండోర్ లో పనిచేస్తూ, లాక్ డౌన్ కారణంగా ఇంటికి వచ్చిన వ్యక్తి.. తాను కరోనా కాటుకు గురయ్యానన్న సంగతి తెలియకుండా కటింగ్ చేయించుకున్నాడట. సరిగ్గా అదే రోజు ఆ బార్బర్ షాపులో ఇంకో 11 మంది కటింగ్, షేవింగ్ చేసుకున్నారట. అయితే ఏమయ్యింది అనుకుంటున్నారా…. ఆగండి ఆగండి అక్కడే ఉంది అసలు కిటుకు… ఇవేవో సాదారణ రోజుల్లా భావించిన సదరు బార్బర్.. అందరికీ ఒకే టవల్ వాడాడంట.

కరోనా పేషెంట్ ముఖాన్ని తుడిచిన అదే టవల్ ను మిగతా 11 మందికీ వాడటంతో అందులో ఆరుగురు వ్యక్తులకు వైరస్ సోకిందట. సరే వారిని గుర్తించిన అధికారులు వారిని ఐసోలేషన్ లో పెట్టారనుకోండి.. అది వేరే విషయం! ఇక్కడ మరో చిత్రం ఏమిటంటే… నిత్యం శానిటైజర్ వాడటం, తాను మాత్రం జాగ్రత్తగా ఉండటంతో సదరు బార్బర్ కి మాత్రం కరోనా అంటలేదంట. ఈ జాగ్రత్త కటింగ్ చేయించుకోవడానికి వెళ్లినవారికి లేకుండా పోయిందనుకోవాలా లేక ఈ బార్బర్ తన ఆరోగ్యంపై చూపించిన శ్రద్ధ తన కష్టమర్ లపై చూపించలేదనుకోవాలా? ఏది ఏమైనా… కటింగ్ చేయించుకున్నవారు మాత్రం ప్రస్తుతానికి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతూ ఉంటే… ప్రభుత్వం ఆ షాప్ కి సీల్ వేసేయడంతో సదరు బార్బర్ ఇంటి పట్టునే ఉంటున్నాడట!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version