కరోనా లాక్డౌన్ కారణంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకే కాదు.. అటు కేంద్రానికి కూడా చాలా ఆదాయం తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు కేంద్రం ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే ఓ ప్రత్యేక బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఆ బృందాన్ని ఫోర్స్ టీం అని పిలుస్తున్నారు. ఇక ఈ టీం కేంద్రానికి ఆదాయం పెంచుకునేందుకు గాను పలు మార్గాలను సూచించింది. అవేమిటంటే…
* సూపర్ రిచ్ అయిన వ్యక్తులపై ట్యాక్సింగ్ ది వెల్దీ పేరిట 40 శాతం పన్ను విధించనున్నారు. దీంతో కేంద్రానికి భారీగా ఆదాయం రానుంది.
* విదేశాలకు చెందిన కంపెనీలు భారత్‌లో సంపాదించే సొమ్ముపై ఇప్పటి వరకు 2 శాతం సర్‌చార్జి విధించారు. ఇకపై ఇది 5 శాతం కానుంది. దీంతో కేంద్రానికి భారీగా ఆదాయం లభ్యం కానుంది.
* ప్రస్తుతం ప్రజలు చెల్లించే పన్నుల్లో ఎడ్యుకేషనల్ సెస్ 2 శాతంగా ఉంది. దీన్ని 4 శాతానికి పెంచనున్నారు. కోవిడ్ రిలీఫ్ సెస్ పేరిట వన్‌టైం కింద ఈ సెస్‌ను వసూలు చేస్తారు. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటిన వారిపై ఈ సెస్ విధించబడుతుంది. దీంతో రూ.18వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా.
* కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిటీ (సీఎస్ఆర్), ఇంటి ట్యాక్స్ సేవింగ్స్ స్కీంల ద్వారా వచ్చే డబ్బును కోవిడ్ 19 రిలీఫ్‌కు ఉపయోగించనున్నారు. అలాగే 1985 వరకు అమలులో ఉన్న ఇన్హెరిటన్స్ ట్యాక్స్‌ను మళ్లీ విధించే యోచనలో ఉన్నారు.
* 2016 ప్రవేశపెట్టిన ఈక్వలైజేషన్ లెవీ ట్యాక్స్ 6 శాతంగా ఉండగా.. దీన్ని ఇంకా ఎక్కువకు పెంచాలని చూస్తున్నారు. తద్వారా కేంద్రానికి ఆదాయం పెరగనుంది.
* నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం తదితర ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసులపై డిజిటల్ పన్ను విధించాలని, తద్వారా మరింత ఆదాయం వస్తుందని కేంద్రం భావిస్తోంది.
* సంపన్నులు గ్యాస్ సబ్సిడీని వదులుకునే విధంగా మరింత విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. దీంతో కేంద్రంపై పడే భారం కొంత వరకు తగ్గుతుంది.
* దేశంలో సెక్షన్ 80సి కింద ఇచ్చే మినహాయింపులను సంపన్నులు వదులుకోవాలని కేంద్రం కోరనుంది. దీంతో కేంద్రానికి వచ్చే ఆదాయం పెరగనుంది.
అయితే పైన చెప్పినవే కాకుండా.. రానున్న 6 నెలల కాలంలో కేంద్రం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలునన్ని మార్గాలను అనుసరించాలని చూస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.