ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా అమలు చేస్తున్న దీపం పథకంపై ప్రతిపక్ష వైసీపీ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. చంద్రబాబు ఇటీవల దీపం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. ఏపీలోని పేద మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందించనుంది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఈ స్కీం ద్వారా పేద మహిళలను మోసం చేస్తోందని వైసీపీ పార్టీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది.
ఉచిత సిలిండర్ పేరిట అరకొరగా లబ్దిదారులను కూటమి సర్కార్ ఎంపిక చేసిందని వైసీపీ దుయ్యబట్టింది. దాదాపు అరకోటి మందిని ఈ పథకానికి దూరం చేసిందని ఆరోపించింది. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. శాడిస్ట్ చంద్రబాబు చెప్పేవన్నీ ‘గ్యాస్’ కబుర్లేనని విమర్శించింది. ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వడానికి రూ.4వేల కోట్లు అవసరమైతే.. ప్రభుత్వం కేవలం రూ.2,684.75 కోట్లు ఇస్తే ఎలా 3 సిలిండర్లు ఇస్తారని ఫైర్ అయ్యింది.