రాజకీయాల్లో వేర్వేరు మార్గాల్లో వేర్వేరు గొంతుకలు వినిపిస్తూ ఉంటాయి. మనుషులం కదా విభిన్న ధోరణుల్లో విభిన్న ఉత్పాతాలనూ సృష్టిస్తుంటాం. ఆ తోవలో ఆ కోవలో తప్పులు జరిగితే జరగనీ ? ఎవ్వరు కాదనరు ! కానీ తప్పులు దిద్దుకోవడం ఓ మంచి మనిషి లేదా ఓ మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు చేయాల్సిన పని. అందుకే తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని ఓ శతకకారుడు చెప్పారు. ఆ విధంగా రాజకీయం రుజువర్తనంలో ఉండదు. కేవలం కొన్ని తప్పులకు సంకేతాలుగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో భిన్న రాజకీయం ఉంది. భిన్న ఉద్యమ నేపథ్యం ఉంది. ఉద్యమ కాలం నుంచి ఇప్పటిదాకా తమ ప్రాంతాన్ని బాగు చేసుకుందాం అన్న స్పృహ నాయకుల కన్నా పౌరుల్లో ఉంది. ఆ మాటకు వస్తే వాళ్ల చైతన్యం ముందు కొందరు నాయకులు తలలు వంచారు. అహం వదిలారు కూడా ! దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ ఏర్పాటయ్యాక ఉద్యమేతర వ్యక్తులు సీన్ లోకి వచ్చారు.
వాళ్లే తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలకం అయ్యారు. ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారు ఎక్కడున్నారో అందరికీ తెలుసు. ఇప్పటికీ కేసీఆర్ తగువు పెట్టుకోవాలనుకుంటే తలసాని శ్రీనుతోనే తగువు పెట్టుకోవాలి కూడా ! కొడుకు భవిష్యత్ కోసం ఆయన చేస్తున్న కొన్ని పనులు కేసీఆర్ కు తలనొప్పిగా మారేయి కూడా ! ఇక ఆ రెండు పార్టీలంటే కేసీఆర్ కు ఎందుకు ఇంతటి హడల్ ?
మొన్న చంద్రబాబు వచ్చి వెళ్లారు. హైద్రాబాద్ కు వచ్చి వెళ్లారు. ఎన్టీఆర్ భవన్ కు వచ్చి వెళ్లారు. దిశా నిర్దేశం చేసి వెళ్లారు. కార్యకర్తలు ఆ మాటలు విని ఆనందించారు. అప్పుడు కేసీఆర్ స్పందించలేదు. వాస్తవానికి ఎందుకు స్పందించలేదు అంటే టీడీపీ ఓటు బ్యాంకు అంతా టీఆర్ఎస్ ఎప్పుడో టర్న్ అయిపోయింది.ఇప్పుడేమన్నా వివాదమే ! కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొన్నింట స్థిరంగా ఉందన్న భయాలు కేసీఆర్-కు ఉన్నాయి. అందుకే వరంగల్ సభ జరిగిన వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆ విధంగా కేసీఆర్..తనదైన పంథాలో రాజకీయం చేస్తూ ఇతరుల తప్పులు ఎంచడంలో ముందుంటున్నారు అన్న అభియోగం ఒకటి ఎప్పటి నుంచో మోస్తున్నారు.మరి! అధికారంలో ఉన్న ఆయన ఎన్ని తప్పులు చేశారో ? ఇదే సమయంలో బీజేపీ పార్టీ అంటే కూడా హడల్ ..ఎందుకంటే టీఆర్ఎస్ ను ఎవ్వరన్నా వద్దనుకుంటే వెంటనే ఓ రిహేబిటేషన్ క్యాంప్ మాదిరి బీజేపీ వారిని అక్కున చేర్చుకుని, అన్నం పెడుతుంది.
కేసీఆర్ దగ్గర అన్యాయం అయినవాళ్లంతా ఇక్కడికి చేరి నిలదొక్కుకున్నవాళ్లే ! పూర్తి అంగీకారంతో వాళ్లు అక్కడ లేకున్నా అందుకు వాళ్ల మనసు అంగీకరించకున్నా బీజేపీని ఇప్పటికిప్పుడు మిస్ చేసుకోలేరు. అందుకే ఈటెల, రఘునందన్ లాంటి లీడర్లు ఆ పాటి అయినా అక్కడ ఏదో ఒక విధంగా సర్దుకుపోగలుగుతున్నారు. టీఆర్ఎస్ లో చీలిక వచ్చినా లేదా మరో పార్టీ అంటూ తలసాని శ్రీను లాంటి వారు బెదిరించినా కేసీఆర్ కు హడల్.. తెలంగాణ ఇంటి పార్టీ చీలిపోతే జాతీయ పార్టీలలో ఏదో ఒక పార్టీ వారికి అండగా నిలవడం ఖాయం. అందుకే వారంటే కేసీఆర్ కు హడల్ డల్ డల్.