ఎప్పటి నుంచో మద్యనిషేధంపై వివాదాలు నడుస్తున్నాయి. కానీ ఓ సర్కారుకు ఆశించిన స్థాయి కన్నా ఎక్కువగానే ఆదాయం ఇచ్చే మద్యం అమ్మకాలను ఏ పాలకుడు మాత్రం వద్దనుకుంటారు. ఆ రోజు పాదయాత్రలో చెప్పిన మాటలకు భిన్నంగా నడుస్తున్న ప్రస్తుత వ్యవహారం మరిన్ని మలుపులు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో సహజ మరణాలకూ, సారా మరణాలకూ తేడా అన్నది ప్రజలకు తెలియదా …? కల్తీ సారా తాగి పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెంలో 18మందికి పైగా మరణిస్తే అవన్నీ సహజ మరణాలే అని చెప్పి ప్రభుత్వం ఓ తప్పుడు నివేదిక ఇచ్చిన వైనాన్ని తామెలా మరిచిపోగలం అని అంటోంది టీడీపీ.
గత కొద్ది కాలంగా ఆంధ్రావనిలో మద్యం అమ్మకాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. కొన్ని డిస్టిలరీలు టీడీపీకి చెందినవి ఉన్నాయని వైసీపీ, మా కన్నా మీకే ఎక్కువ మద్యం తయారీ కేంద్రాలు ఉన్నాయని వైసీపీ అంటూ తిట్టిపోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం తయారీ అన్నది పూర్తిగా వైసీపీ కనుసన్నల్లోనే ఉందన్నది ఓ వాస్తవం. నాణ్యమైన మద్యం అందుబాటులో లేక నాటు సారా వైపు మొగ్గు చూపుతున్నారన్న మాట కూడా వాస్తవం. దీంతో కల్తీసారా విక్రయాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒడిశా నుంచి వచ్చే కల్తీ సారాను అస్సలు నియంత్రించే నాథుడే లేడు. అదేవిధంగా ప్రతి జిల్లాలో పెరిగిపోతున్న బెల్ట్ షాపులను నియంత్రించే వాడే లేడు. ఇలాంటి సందర్భంలో తాము చేస్తున్నదంతా మంచే అని వైసీపీ ఎలా చెబుతుంది? అన్నది టీడీపీ ప్రశ్న.
ఆంధ్రప్రదేశ్ లో అమ్ముడవుతున్న వివిధ మద్యం బ్రాండ్లను పరిశీలిస్తే వీటిలో సైనైడ్ ఆనవాళ్లు ఉన్నాయని పరిశోధనలు తేల్చాయి.అత్యంత ప్రమాదకర స్థితిలో హానికర రసాయినాలు ఉన్నాయని చెన్నయ్ కు చెందిన లాబ్స్ తేల్చాయి. దీంతో ఏపీలో సర్కారు అమ్మే మద్యం తాగితే జీవన ప్రమాణాలు పడిపోయేందుకు అవకాశాలే ఎక్కువ ఉన్నాయని టీడీపీ ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా చాలా వాటిలో హానికర రసాయనాలు మోతాదుకు మించి ఉన్నా, వాటి నియంత్రణకు జగన్ సర్కారు చర్యలేవీ తీసుకోవడం లేదని విస్తుబోతోంది.
మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం పెంచుకోవాలని చూస్తుందే తప్ప ప్రభుత్వానికి మిగతా విషయాల్లో చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని ఆరోపిస్తోంది. గతంలో కన్నా ఇప్పుడు మద్యం అమ్మకాలు పెరిగినా కూడా ఆదాయం లేని ఆంధ్రాగా ఎందుకు మనం మిగిలిపోతున్నామో వైసీపీకే తెలియాలి అని కూడా అంటోంది. ఓ వైపు ఆదాయార్జనే ధ్యేయంగా వైసీపీ పెద్దలే బాహాటంగా మద్యం అమ్మకాలు సాగిస్తుంటే, వాటిని నియంత్రించలేకపోగా, కనీస ప్రమాణాలకు అనుగుణంగా అయినా లిక్కర్ తయారు చేయాలన్న కనీస ఆలోచన లేకుండా ఉండడం విచారకరం అని ఆవేదన చెందుతోంది. రాష్ట్రంలో అమ్ముడవుతున్న ఓల్డ్ టైమర్ , ఛాంపియన్, రాయల్ సింహ, గ్రీన్ ఛాయిస్, సెలబ్రిటీ వంటి బ్రాండ్లు అన్నీ నాసిరకానికి చెందినవే అని తేలిపోయిందని ఆధారాలతో సహా నిరూపిస్తోంది.