తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే అంజన్న ఆలయాలకు భక్తులు బారులు తీరుతున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో హనుమాన్ విజయయాత్ర జరగనుంది. ఈ యాత్ర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 1500 లకు పైగా పోలీసులతో యాత్ర కొనసాగే మార్గాల్లో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
ఇవాళ ఉదయం 11.30 గంటల సమయంలో గౌలిగూడ రామమందిరం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ తాడ్‌బన్ హనుమాన్ దేవాలయం వద్ద ముగియనుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు, బార్‌లు ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసివేయనున్నారు. వాహనదారులు, భక్తులు ఆంక్షలు పాటించి యాత్ర సజావుగా సాగేందుకు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు.
ఊరేగింపు కొనసాగే గౌలిగూడ, పుత్లిబౌలి, కోఠి, సుల్తాన్‌బజార్, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, గాంధీనగర్, కవాడీగూడ, బైబిల్ హౌస్, రాంగోపాల్‌పేట్, ప్యారడైజ్ ప్రాంతాల మీదగా తాడ్‌బన్ హనుమాన్ దేవాలయం వరకు దాదాపు 12 కిలోమీటర్ల వరకు యాత్ర కొనసాగనుండటంతో ఆ మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.