ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ టీంకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఆటగాడు హర్భజన్ సింగ్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు భజ్జీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. వ్యక్తిగత కారణాల వల్లే టోర్నీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. కాగా ఇప్పటికే కరోనా కష్టాలు, సురేష్ రైనా నిష్క్రమణతో ఇబ్బందుల్లో పడ్డ చెన్నై జట్టుకు భజ్జీ రూపంలో మరో షాక్ తగిలినట్లయింది.
చెన్నై సూపర్ కింగ్స్ టీంకు నిజానికి ఈ సారి అదృష్టం కలసివస్తున్నట్లు కనిపించడం లేదు. ఆ జట్టుకు చెందిన 12 మంది స్టాఫ్, ఇద్దరు ప్లేయర్లు కరోనా బారిన పడగా, కీలక ఆటగాడు రైనా వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు అదే బాటలో హర్భజన్ సింగ్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే చెన్నై జట్టుకు బౌలర్ల కొదువ లేకున్నా సురేష్ రైనా రూపంలో మాత్రం పెద్ద ఎదురు దెబ్బే తగిలిందని చెప్పవచ్చు.
ఇక నిజానికి భజ్జీ చెన్నై టీంతో ఎప్పుడో దుబాయ్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ అతను వెళ్లడం కొంత ఆలస్యమైంది. అయితే దుబాయ్‌కి వెళ్లకుండానే భజ్జీ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కాగా ఆగస్టు 15 నుంచి 20 తేదీల మధ్య చెన్నైలో సీఎస్‌కే నిర్వహించిన శిక్షణా శిబిరానికి కూడా భజ్జీ హాజరు కాలేదు.