తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. భానుడి ప్రతాపానికి రోడ్డు మీదకు రావాలి అంటే భయపడిపోయే పరిస్థితి నెలకొంది.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు రేపు మరింతగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణాకు వడగాలుల ముప్పు పొంచి ఉందని తెలంగాణ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
అలాగే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ ముప్పు ఆరో తేదీ వరకు కొనసాగుతుందని హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప ఎండ ఉన్న సమయంలో బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు. అలాగే బయటకు రావాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకున్నాకనే రావాలని హెచ్చరిస్తున్నారు. ఇక జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రెండు రోజులు ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.