మందుబాబులకు అలర్ట్‌.. తాగి దొరికితే.. రూ.10 వేలు ఫైన్‌

-

తెలంగాణ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌లపై కొరడా ఝళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. తాగి బండి నడిపి పట్టుబడిన వారికి భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించారు. న్యూ ఇయర్ వేడుకలకు నగరం ముస్తాబవుతున్న వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రోజు రాత్రి నుంచి రేపటి వరకు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించినట్టు ప్రకటించారు. నేటి అర్ధరాత్రి నుంచి బేగంపేట, లంగర్‌హౌస్ తప్ప అన్ని వంతెనలపై నుంచి రాకపోకలను నిషేధించారు. అలాగే, డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు తెలిపారు.

తాగి వాహనం నడుపుతూ తొలిసారి పట్టుబడితే రూ. 10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామన్నారు. రెండోసారి పట్టుబడితే రూ. 15 వేలు ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అలాగే, డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేసి సస్పెన్షన్‌కు రవాణా శాఖకు పంపుతామన్నారు. మొదటిసారి పట్టుబడితే మూడు నెలలు రద్దు చేస్తామని, రెండోసారి పట్టుబడితే లైసెన్స్‌ను పూర్తిగా రద్దు చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, శిక్షలకు దూరంగా ఉండాలని కోరారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version