పాకిస్థాన్‌లో వరదలు.. వెయ్యి దాటిన మృతుల సంఖ్య

-

పాకిస్థాన్‌ను వరదలు కుదిపేస్తున్నాయి. సింధ్‌ ప్రావిన్స్‌, బలూచిస్థాన్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా, పంజాబ్‌ ప్రావిన్స్‌లో కురుస్తున్న భారీ కురుస్తున్నాయి. సుమారు 3.3 కోట్ల మంది ప్రజలపై వర్షాలు, వరదల ప్రభావం పడినట్టు అంచనా వేస్తున్నారు. వరదల కారణంగా ఇప్పటి వరకు 1,033 మంది ప్రాణాలు కోల్పోగా మరెంతోమంది నిరాశ్రయులయ్యారు. గత 24 గంటల్లోనే 119 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. అలాగే, ఇప్పటి వరకు 1,456 మంది గాయపడినట్టు పాకిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ఈ స్థాయిలో వర్షాలు కురవడం గత 30 సంవత్సరాలలో ఇదే తొలిసారని పేర్కొంది.

పాకిస్థాన్‌లో వర్షాకాలంలో సగటు వర్షపాతం 132.3 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 192 శాతం అధికంగా 385.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీటమునిగాయి. దేశవ్యాప్తంగా 3.30 కోట్ల మందిపై వరదలు ప్రభావం చూపినట్టు పాకిస్థాన్ అంతర్గత మంత్రి రాణా సనావుల్లా తెలిపారు. వరద బాధితులకు సాయం అందించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపినట్టు తెలిపారు. వర్షాల కారణంగా దేశంలోని 149 వంతెనలు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా అతలాకుతలం అవుతున్న పాకిస్థాన్‌కు ఆపన్న హస్తం అందించేందుకు ఖతర్, ఇరాన్‌తో పాటు మరికొన్ని దేశాలు ముందుకొచ్చాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version