మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.అనేక ప్రాంతాలు నీటమునిగాయి. సౌత్ గారో హిల్స్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో కురిసిన వర్షాల కారణంగా మరణాలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది.
ఇక గాసుపరా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.మారుమూల గ్రామమైన హతియాసియా సోంగ్మాలో కొండచరియలు విరిగిపడి ఇంటి మీద పడటంతో ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లొ ముగ్గురు మైనర్లు సైతం ఉన్నట్లు సమాచారం.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై మేఘాలయ సీఎం కాన్రాడ్ కే సంగ్మా సమీక్ష నిర్వహించారు.బాధితులను ఆదుకుంటామని హామీనిచ్చారు.కొండచరియలు విరిగిపడి దాలుకు ప్రాంతానికి చెందిన ముగ్గురు, హతియాసియా సోంగ్మాకు చెందిన ఏడుగురు మరణించడంపై సీఎం సంగ్మా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.మృతుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సీఎం ఆదేశించారు. కాగా, ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ సహాయక చర్యలు చేపట్టాయి.