కర్ణాటకలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మైసూర్ ప్రాంతం, మండ్య, చామరాజనగర, రామనగర, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఏకధాటి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు మైసూరు, బెంగళూరు మధ్య రహదారిపై నీరు చేరింది.
మండ్య, రామనగర, చామరాజనగర జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. కన్నడ జిల్లాల్లో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రామనగరలో అండర్‌పాస్ వద్ద వరదలో బస్సు చిక్కుకుపోయింది. స్థానికులు సహాయ చర్యలు చేపట్టి ప్రయాణికులను రక్షించారు. రామనగరలో అనేక కార్లు, వాహనాలు నీట మునిగాయి. మరికొన్ని వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. జాతీయ రహదారిపై నీరు చేరడం వల్ల నీట మునిగిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ రహదారిలో ట్రాఫిక్ రద్దీ పెరిగి.. వాహనాలు రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. మరోవైపు, తుమకూరులో రాజ్యసభ సభ్యుడు జగ్గేశ్ ఇల్లు నీట మునిగింది.