బంగాళాఖాతంలో నివర్ తుపాను ఏర్పడనుండటంతో ఏపీ ప్రభుత్వం అలెర్టైంది.తుఫాను కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రభావం చూపే అవకాశమున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.వ్యవసాయ, వైద్యారోగ్య, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం పంట కోతల్ని వీలైనంత త్వరగా చేపట్టాలని రైతులకు హెచ్చరికలు జారీ చేసింది. వైద్య బృందాలను కూడా సిద్ధం చేసుకుంటున్న వైద్యారోగ్యశాఖ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర మందులు,అంబులెన్సులను అందుబాటులో ఉంచాల్సిందిగా జిల్లా వైద్యాధికారులకు సూచనలు చేసింది.
నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలు తుపానుతో తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట సహా మినుము, పత్తి, సన్ ఫ్లవర్ తదితర పంటలకు నష్టం వాటిల్లుతోందన్న ఆందోళనలో ఉన్నారు రైతులు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది ఐఎండీ.