ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో రాజశేఖర్, నరేశ్‌లు ఇద్దరూ రెండు గ్రూపులుగా విడిపోవడం, వారి మధ్య కొద్దిపాటి వివాదాల నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. అయితే చివరికి అత్యధిక మెజారిటీ ఓట్లతో నరేశ్ మా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఇక అప్పటినుండి ఆ రెండు గ్రూపుల మధ్య కొద్దిపాటిగా ఏదో రకంగా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక నేడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఆ వివాదాలు పూర్తిగా బహిర్గతం అయ్యాయి.
ముందుగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ‘మా’ తరపున జరుగుతున్న కార్యక్రమాలు, అలానే మా అసోసియేషన్ తరపున పలువురు నటులకు కట్టిస్తున్న ఇళ్ళు వంటి వాటి గురించి ప్రస్తావించడం జరిగింది. తమవంతుగా అందరం మా అసోసియేషన్ కు సహాయం అందించడానికి ఎప్పుడూ ముందు ఉంటాం అని ఆయన అన్నారు. అయితే మెగాస్టార్ మాట్లాడుతున్న సమయంలో, మధ్యలో అక్కడక్కడా అడ్డుపడిన రాజశేఖర్, కాసేపటి తరువాత అర్ధాంతరంగా స్టేజ్ పైకి వచ్చి పరుచూరి గోపాల కృష్ణ దగ్గరి నుండి మైక్ లాక్కుని, స్టేజ్ పైన ఉన్నవారందరి కాళ్ళకు మ్రొక్కి, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
చిరంజీవి ఎప్పుడో ఒకసారి ఇటువంటి మీటింగ్స్ కి వస్తుంటారని, అలానే అసోసియేషన్ లో జరిగేది ఒకటి అయితే బయటకు చెప్పేది మరొకటని, అసలు ఇక్కడ అంతా బాగానే ఉందని చెప్పడానికి చిరంజీవి ఎవరని, కేవలం ఒక సాధారణ సభ్యుడు మాత్రమే అని అన్నారు. అంతేకాక ఇటీవల అసోసియేషన్ వల్ల తన కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, తనకు ఇటీవల జరిగిన ప్రమాదానికి కూడా ఈ గొడవలే కారణం అని సంచలనంగా వ్యాఖ్యానించారు. అయితే రాజశేఖర్ ఆ విధంగా చేసిన రచ్చకు మెగాస్టార్ సహా స్టేజ్ పైన ఉన్నవారందరూ కూడా దిగ్బ్రాంతికి గురై, ఆయన పై అసహనం వ్యక్తం చేసారు. దీంతో కొంత ఆగ్రహానికి లోనైన చిరంజీవి, రాజశేఖర్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టారు. మంచి చెప్పాలంటే మైకులో చెప్పాలని, చెడు చెప్పాలంటే చెవిలో చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. రాజశేఖర్‌పై ‘మా’ క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని సూచించారు. మోహన్‌బాబు కూడా చిరంజీవిని సమర్థించారు. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది….!!