నిమ్మగడ్డకు ఏపీ హైకోర్ట్ షాక్..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ను కొట్టివేసింది. దీంతో ఇక ఇప్పట్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్లే అని చెబుతున్నారు. నిజానికి నిమ్మగడ్డ ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు అంటూ అందుకు సంబందించిన షెడ్యూలు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించలేమని చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ హైకోర్టు ఆశ్రయించింది.

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్ట్ ప్రజా ఆరోగ్యం దృష్ట్యా షెడ్యూల్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యం దృష్ట్యా వ్యాక్సినేషన్ కు ఎన్నికల ప్రక్రియ అడ్డు రాకూడదు అని హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇక అంతకు ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍పై వేటు వేసింది ఎన్నికల కమిషన్. 30 రోజులపాటు సెలవుపై వెళ్లడమే కాకుండా.. ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారనే ఆరోపణలతో అయనను ఆర్టికల్ 243 రెడ్ విత్, ఆర్టికల్ 324 ప్రకారం విధులనుంచి తొలగిస్తున్నామని ఎస్ఈసీ స్పష్టం చేసింది.